దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందన్న అంశాన్ని తాజాగా వెలువడిన మార్చి మౌలిక రంగం గణాంకాలు వెల్లడించాయి. ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి మార్చిలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –6.5 క్షీణతలోకి జారిపోయింది. తాజా గణాంకాలను గురువారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఎనిమిది రంగాలనూ పరిశీలిస్తే…
► క్రూడ్ ఆయిల్ (–5.5 శాతం), సహజ వాయువు (–15.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–0.5%), ఎరువులు (–11.9%) స్టీల్ (–13 శాతం), సిమెంట్ (–24.7%), విద్యుత్ (–7.2 శాతం) రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి.
► ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 9.1 శాతం నుంచి 4.1 శాతానికి పడింది.
ఏప్రిల్–మార్చి 0.6 శాతం: 2019 మార్చిలో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 5.8%. ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఇక 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు కేవలం 0.6%గా నమోదయ్యింది. 2018–19లో ఈ రేటు 4.4%.
వృద్ధికి మౌలికం కీలకం: ఆర్థికశాఖ టాస్క్‌ఫోర్స్ ఇదిలావుండగా, భారత్ వృద్ధికి, 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడానికి మౌలిక రంగం అభివృద్ధి కీలకమని ఆర్థికమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఒక టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తుది నివేదికను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. మౌలిక రంగంలో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నం, కొత్తప్రాజెక్టులు చేపట్టడం వృద్ధికి కీలకమని అభిప్రాయపడింది. 2019–20 నుంచి 2024–25 మధ్య మౌలిక రంగంలో దాదాపు రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని విశ్లేషణలను ప్రస్తావించింది. మౌలిక రంగం పర్యవేక్షణ, అమలు, నిధుల సమీకరణ విషయంలో దృష్టి పెట్టడానికి మూడు వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది.
#economy #gdp #covid19