భవన నిర్మాణాలకు అనుమతి
ఆ లారీలను అడ్డుకోవద్దంటూ ఆదేశాలు
అమలులోకి తీసుకువచ్చిన పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులుస్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. వీరి ప్రయాణాలకు సంబంధించిన కసరత్తు మొదలెట్టాయి. ఇదిలా ఉండగా… ఓ సందేహం రాష్ట్ర యంత్రాంగాలకు వచ్చింది. గడిచిన 40 రోజులుగా లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలైంది. ఇప్పుడు వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయి… మరో నాలుగైదు నెలల వరకు రాకపోతే…లాక్‌డౌన్ ఎత్తేసినా ఈ రంగం కోలుకునే అవకాశం ఉండదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న యంత్రాంగం వీలున్నంత వరకు వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఆపాలని నిర్ణయించింది. దీనికోసం శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతిచ్చింది. వాటికి సంబంధించిన లారీలను, వాహనాలను ఆపవద్దంటూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో నగర పోలీసులు అమలులోకి తీసుకువచ్చారు. రాజధాని నగరంలో అనేక రంగాలు వలస కార్మికులపై ఆధారపడి నడుస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి నిర్మాణరంగంతో పాటు హాస్పిటాలిటీగా పిలిచే హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలు. (ఎన్నాళ్లో వేచిన ఉదయం)
లాక్‌డౌన్ నేపథ్యంలో వీటన్నింటి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యధిక సంఖ్యలో వలసకార్మికులు నిర్మాణ రంగంపైనే ఆధారపడి నివసిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కొరోన విస్తరణకు అడ్డుకునే చర్యల నేపథ్యంలో ఇప్పట్లో హాస్పిటాలిటీ రంగాన్ని అనుమతించే ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం నిర్మాణ రంగంపై దృష్టి పెట్టింది. మరోపక్క వలస కార్మికుల విషయంలో బుధవారం కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పోలీసు విభాగం వారు ఉండే ప్రాంతాలకు వెళ్ళి పరిశీలన జరిపింది. మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో చోటు చేసుకున్న అపశ్రుతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి సంసిద్ధులైనప్పుడు ఇలాంటి చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ పరిశీలన చేపట్టారు. హైదరాబాద్ పోలీసులే గురువారం ఒక్క రోజు 30 వేల మంది వలస కార్మికులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ విషయం స్పష్టమైంది. నగరంలో ఉన్న నిర్మాణ రంగ వలస కార్మికుల్లో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌ల నుంచి తాపీ మేస్త్రీలు, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి సెంట్రింగ్ వర్కర్లు, ఒడిస్సా నుంచి ప్లంబర్లు, రాజస్థాన్ నుంచి మార్బుల్ వర్కర్లు, కార్పెంటర్లు, ఉత్తరప్రదేశ్, బీహార్‌ల నుంచి పెయింటింగ్, ఫాల్స్ సీలింగ్ వర్కర్లు, పశ్చిమ బెంగాల్ నుంచి ఎలివేషన్ వర్కర్లు వచ్చి ఇక్కడ ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు.
వీరిలో ఇప్పటికే అనేక మంది వెళ్ళిపోగా.. మిగిలిన వారిలో ఎవరూ కొరోన వైరస్ విషయంలో భయపడట్లేదు. కేవలం పనులు దొరక్క జీవనోపాధిని కోల్పోతున్నామనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం యంత్రాంగం శుక్రవారం నుంచి నిర్మాణ రంగాన్ని అనుమతించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇనుము, సిమెంటు, ఇటుక, కంకరు తదితర సరుకుల్ని రవాణా చేసే వాహనాలు ఆపవద్దంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం నుంచి హైదరాబాద్ పోలీసులు అమలులోకి తీసుకువచ్చారు. ఒకటి రెండు రోజుల్లో కూలీలనూ ఆయా నిర్మాణ పనులకు అనుమతించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఓ ఉన్నతాధికారి సాక్షితో మాట్లాడుతూ.. ప్రాథమికంగా పెద్దపెద్ద నిర్మాణ సంస్థలతో పాటు జీహెచ్‌ఎంసీ నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ఆయా వర్క్ సైట్స్‌లో భౌతికదూరం అమలు, శానిటైజేషన్‌లతో పాటు కార్మికులకు మాస్కుల పంపిణీ, కొరోన నిరోధక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లు, యాజమాన్యాలకే ఉంటుంది. వీటి అమలును స్థానిక పోలీసులతో సహా ఇతర విభాగాలు పర్యవేక్షిస్తాయి. రెండో దశలో ఇతర నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నాం… అని అన్నారు. #migrantworkers #Lockdown #Realestate #Constructions #Hyderabad